: రాజన్ బాధ్యతలు ఎవరికో?... నలుగురితో జాబితా సిద్ధం!
రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా రఘురాం రాజన్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వరుస ఎదురుదాడితో నెలకొన్న వివాదం నేపథ్యంలో రెండో పర్యాయం ఆ పదవిని చేపట్టలేనని రాజన్ తేల్చిచెప్పారు. దీంతో రాజన్ ఖాళీ చేయనున్న ఆర్బీఐ గవర్నర్ పదవికి కొత్త ఆర్థిక వేత్తను ఎంపిక చేసే పనిని మోదీ సర్కారు చేపట్టక తప్పలేదు. ఈ క్రమంలో రాజన్ వారసుడిగా పలువురి పేర్లు వినిపించినా... విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నలుగురు ఆర్థిక వేత్తలతో ఓ జాబితా సిద్ధమైంది. ఈ నలుగురిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆరుంధతీ భట్టాచార్య ఒకరుగా ఉన్నారు. మిగిలిన ముగ్గురిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తో పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా పనిచేసిన మాజీలు రాకేశ్ మోహన్, సుబీర్ గోకర్ణ్ ఉన్నారు. వీరిలో ఎవరికి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.