: మోదీకి పెరుగుతున్న ఇంటి పోరు!... నిరసన గళం విప్పిన యశ్వంత్ సిన్హా!
పాలనలో తనదైన శైలిలో దూసుకెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిరసన గళం విప్పుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. విపక్షాలను పక్కనబెడితే సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు మద్దతు లభించడం లేదు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం స్వయంగా రంగంలోకి దిగిన మోదీ... కార్యరంగంలో ఓటమిపాలయ్యారు. దీనినే ఆసరా చేసుకుని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నిన్న మోదీపై ధ్వజమెత్తారు. మోదీ కేబినెట్ లో తన కొడుకు జయంత్ సిన్హాకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి ఇప్పించుకున్న యశ్వంత్ సిన్హా... నేరుగా ప్రధానిపైనే ఎదురు దాడి చేయడం గమనార్హం. నిన్న ఢిల్లీలో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా యశ్వంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్ఎస్జీలో సభ్యత్వం భారత్ కు ఎందుకంటూ ఆయన మోదీ వైఖరిని తప్పుబట్టారు. ప్రస్తుతం అణ్వస్త్ర రంగానికి సంబంధించి భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని చెప్పిన యశ్వంత్... ఎన్ఎస్జీలో సభ్యత్వంతో ఆ మెరుగైన పరిస్థితిని కోల్పోవాల్సి వస్తుందని కూడా కొత్త వాదన వినిపించారు.