: డ్యూటీ మరచి రోడ్లపై చక్కర్లు కొట్టిన రోబో... చంపవద్దని ప్రజల వినతి!
రజనీకాంత్ నటించిన రోబో చిత్రం తెలుసుగా. తాను తయారు చేసిన 'చిట్టి' ఆలోచించడం మొదలు పెట్టి స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ మానవాళికి విఘాతకారి కాగా, స్వయంగా దాన్ని నాశనం చేసే స్టోరీతో ఇది సాగుతుంది. సరిగ్గా అలాంటిదే రష్యాలోని పెర్మ్ నగరంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రోమోబో అనే రోబో ఓ వ్యాపార సంస్థలో కస్టమర్లకు సహాయం చేసే విధుల్లో ఉండేది. ఇక ఇది తన పనిని పక్కన బెట్టి వీధుల్లోకి వచ్చింది. రోడ్లపై చక్కర్లు కొడుతోంది. పనిని మరచిన ఈ రోబోను రీసైకిల్ చేయాలని తయారీదారులు నిర్ణయించగా, కూడదంటూ ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. రోడ్లపై తిరగాలన్న కోరికే దాన్ని బయటకు రప్పించిందని, దీన్ని చంపాలన్న ఆలోచనను విరమించాలని ప్రజలు అంటున్నారు. రోబో పని మరచి వాహ్యాళికి వెళ్లడానికి గల కారణం తెలుసుకుని దాన్ని సరిచేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కస్టమర్లకు సేవ చేస్తున్న రోబో, ఆపై రోడ్లపై చక్కర్లు కొడుతున్న రోబో చిత్రాలు వైరల్ అవుతున్నాయి.