: 69 ఏళ్లకు వచ్చిన తొలి బస్సు... స్వాగతం పలికిన ప్రజలు!
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 69 ఏళ్ల తరువాత ఆ గ్రామానికి తొలిసారిగా బస్సు వచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా సిల్ పాటా గ్రామానికి ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకం కింద రహదారి నిర్మాణం జరుగగా, తొలిసారిగా తమ గ్రామానికి వచ్చిన బస్సుకు ఊరివాళ్లంతా కేరింతలతో స్వాగతం పలికారు. తమ కల నిజమయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మా ఊరికి రోడ్డు వేస్తారని, బస్సు వస్తుందని ఊహించలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మా గ్రామానికి రహదారి కల్పించాలని కోరుతూనే ఉన్నాం. మా జీవితంలో ఇక ఇది జరగదేమోనని భావించాం. కానీ, రోడ్డును, బస్సును మా కళ్లతో చూస్తున్నాం. మేము పడ్డ కష్టాలను తదుపరి తరాలు పడబోవు" అని సిల్ పాటా గ్రామస్తుడు కలామ్ సింగ్ బిస్త్ వ్యాఖ్యానించారు. రోజువారీ అవసరాల నిమిత్తం దగ్గర్లోని మార్కెట్ కు వెళ్లాలంటే, ఎన్నో కిలోమీటర్లు కొండలపై ప్రయాణించాల్సిన అవసరం ఇక లేదని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పూర్తి కొండలతో నిండిన ఈ ప్రాంతంలో రోడ్డు వేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందని ప్రాజెక్టును చేపట్టిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీఎస్ రావత్ వ్యాఖ్యానించారు.