: హైదరాబాద్ లో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం.. ముగ్గురు మృతి
గత రాత్రి నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కాలనీల్లోకి నీరు ప్రవేశించింది. రామాంతపూర్, ఉప్పల్, ఎల్ బీ నగర్, అత్తాపూర్, మల్కాజగిరి, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్ నగర్, హబీబ్ నగర్ ప్రాంతాల్లో కరెంటు వైర్లు తెగిపోయాయి. ఈ తెగిపడ్డ వైర్లను తాకిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మాదాపూర్ లో వర్షపు నీరు పోయేందుకు మ్యాన్ హోల్ ను తెరవడంతో, దానిలో పడి మరో వ్యక్తి మరణించాడు. వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు మొదలైన భారీ వర్షం ఆపై గంట తరువాత తగ్గుముఖం పట్టినప్పటికీ, తెల్లవార్లూ చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.