: పుట్టీ పుట్టగానే ఆధార్... తెలంగాణలో డిజిటల్ లాకర్
ఆధార్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా నవజాత శిశువులకు ఆధార్, బర్త్ సర్టిఫికెట్లను అందించేలా సరికొత్త సేవలు తెలంగాణలో ప్రజలకు అందనున్నాయి. తొలుత పైలట్ ప్రాజెక్టుగా, పుట్టగానే ఆధార్, బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేలా కోటీలోని మెటర్నిటీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిశువు జన్మించగానే ఆసుపత్రి నుంచి కావాల్సిన వివరాలు తీసుకుని, తండ్రి ఆధార్ నంబరుతో అనుసంధానం చేసి డిజిటల్ లాకర్ లో ఉంచుతారు. ఐటీని మరింతగా వినియోగించుకోవడంలో భాగంగా, ఈ అదనపు సౌకర్యాలను అందించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఆధార్ నమోదుకు అవసరమైన ఐరిస్, ఫింగర్ ప్రింట్స్, పిల్లలు పెద్దయిన తరువాత తీస్తామని, ప్రస్తుతానికి చిన్నారి ఫోటో మాత్రం సరిపోతుందని, పుట్టిన గంటల వ్యవధిలో సమాచారం డిజిటల్ లాకర్ లోకి వెళ్లిపోతుందని వెల్లడించారు. దశల వారీగా మిగతా ఆసుపత్రులకూ ఈ సౌకర్యాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ శిశు ఆధార్ ప్రాజెక్టును వినియోగించుకుని ఆసుపత్రుల్లోనే సమాచార సేకరణ కోసం ఓ నిపుణుడిని అందుబాటులో ఉంచుతామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.