: తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రతిపక్షాలపై చంద్రబాబు ఆగ్రహం
రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని తుళ్లూరులో నేలపాడు రైతులకు లాటరీ పద్ధతిలో భూముల కేటాయింపు చేసే కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతుంటే... ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతలు చేసిన రెచ్చగొట్టే ప్రకటనలను రైతులు నమ్మలేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడాన్ని ప్రతిపక్షనేతలు పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ‘ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి ఉండాలని నా కోరిక. కాంగ్రెస్, వైసీపీ రాజధానిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నాయి. లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగే ఆస్కారం ఇక్కడ ఎక్కడ ఉంది..? ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని ఏర్పడితే ప్రజలు బాగుపడిపోతారని వారు ఓర్వలేక పోతున్నారు. ఓ పత్రిక పెట్టి దానికి ‘సాక్షి’ అని తప్పుడు పేరు పెట్టారు. అది అంతా అసత్య ప్రచారమే చేస్తోంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రజల జీవితాలతో ఆడుకోవాలనుకుంటే మేము కూడా కఠినంగానే వ్యవహరిస్తాం. రైలు తగులబెట్టిన వారిని శిక్షిస్తామంటే దానిపై కూడా రాద్ధాంతం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పుతో కొడతామంటూ మాట్లాడే స్థితికి వచ్చారు. ఆ మాటలు వింటుంటే బాధనిపిస్తుంటుంది’ అని చంద్రబాబు అన్నారు.