: మనం బలంగా ఉన్నాం!... బ్రెగ్జిట్ భయం అక్కర్లేదంటున్న రాజన్!
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనంటూ ఆ దేశ ప్రజలు బ్రెగ్జిట్ పేరిట జరిగిన రెఫరెండంలో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారత్ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టాలు చవిచూశాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ మాత్రం నింపాదిగా ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న ఆయన... బ్రెగ్జిట్ ప్రభావం భారత్ పై పెద్దగా ఉండదని కొద్దిసేపటి క్రితం కోల్ కతాలో వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న నేపథ్యంలో స్థానిక సర్దుబాటు కోసం లిక్విడిటీ కల్పిస్తామని చెప్పిన రాజన్... ఈ విషయంలో ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని, గ్లోబల్ కరెన్సీతో పోలిస్తే భారత్ కరెన్సీ బలమైనదని పేర్కొన్న రాజన్... ఈ విషయమే భారత ఆర్థిక వ్యవస్థను బ్రెగ్జిట్ ప్రభావం నుంచి రక్షిస్తుందని చెప్పారు.