: ప్రియుడి కోసం భర్తను వదిలేసి వచ్చిన మహిళ!... దగ్గరుండి కలిపిన వైసీపీ నేత జోగి!


ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది. అబ్బాయి తరఫు పెద్దలు ఈ ప్రేమను పెళ్లిగా మార్చేందుకు ఒప్పుకున్నా, అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. బలవంతంగా ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి చేసేశారు. పెళ్లి కాగానే ప్రియుడిని వదిలేసి భర్తతో అమెరికా వెళ్లిపోయిన ఆ యువతి ప్రియుడిని మాత్రం మరిచిపోలేకపోయింది. తరచూ ప్రియుడితో ఆమె ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. ఈ క్రమంలో భర్తను వదిలేసి వచ్చేయమన్న ప్రియుడి భరోసాతో భర్తను వదిలేసి అమెరికా నుంచి హైదరాబాదులో వాలిన ఆ యువతికి ప్రియుడి అడ్రెస్ కనిపించలేదు. ఇక పుట్టింటి వారు ఆమెను ఇంటిలోకి అడుగుపెట్టనివ్వలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరింది. ఈ విషయం తెలిసిన మీడియా మొత్తం తతంగాన్ని బయటపెట్టడంతో పాటు ఆ యువతిని ప్రియుడి చెంతకు చేర్చేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న వైసీపీ నేత జోగి రమేశ్ ప్రియుడిని ఆసుపత్రికి తీసుకొచ్చి మరీ ఆమె దరి చేర్చారు. కృష్ణా జిల్లా ప్రధాన నగరం విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తాను పెళ్లి చేసుకున్న ప్రభాకర్ ను అమెరికాలో వదిలేసి మానస అనే యువతి విజయవాడ వచ్చేసింది. ఇక అందరి యత్నం ఫలించి తన ప్రియుడు హేమంత్ తో మానస జత కలిసింది.

  • Loading...

More Telugu News