: కుంబ్లే తొలి సందేశాలు టీమిండియా కెప్టెన్లకే!
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. ఈ మేరకు నిన్న ధర్మశాలలో జరిగిన బీసీసీఐ సమావేశానంతరం ఆ సంస్థ చైర్మన్ అనురాగ్ ఠాకూర్ కుంబ్లే నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బరిలోకి దిగిన జట్టు మాజీ డైరెక్టర్ రవి శాస్త్రి, చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ను వెనక్కు నెట్టేసిన కుంబ్లే పదవిని ఎగురవేసుకుపోయాడు. కుంబ్లేను ఏడాది పాటు జట్టు హెడ్ కోచ్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించిన మరుక్షణమే రంగంలోకి దిగిపోయిన స్పిన్ దిగ్గజం టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలకు తొలి సందేశాలు పంపాడు. జింబాబ్వేలో రెండు సిరీస్ లు గెలిచిన ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ ట్వీట్ చేసిన కుంబ్లే... అతడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఇక టెస్టు కెప్టెన్ కు ‘థ్యాంక్స్’ చెబుతూ ట్వీట్ చేసిన కుంబ్లే అతడితోనూ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు.