: కూతుర్ని బతికించుకోలేము... కారుణ్య మరణానికి అనుమతించండి: పేద తల్లిదండ్రుల పిటిషన్
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమ కూతురికి వైద్యం చేయించే ఆర్థిక స్తోమత తమకు లేదని, ఆమె కారుణ్య మరణానికి అనుమతించాలంటూ పేద తల్లిదండ్రులు చిత్తూరు తంబళ్ల పల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ములకల చెరువు మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతులకు 8 నెలల క్రితం కూతురు పుట్టింది. జ్ఞానసాయిగా పిలుచుకుంటున్న ఆ చిన్నారి పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో, బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో బాలికకు శస్త్రచికిత్స చేయించారు. దీనికి రూ.5 లక్షల ఖర్చు అయింది. అయినప్పటికీ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడలేదు. జ్ఞానసాయికి కాలేయ మార్పిడి చేయాలని, అందుకు సుమారు రూ.80 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు డీలా పడిపోయారు. అంత, ఆర్థిక స్తోమత తమకు లేదని, ఇప్పటికే శక్తికి మించి ఖర్చు చేశామని, తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తంబళ్లపల్లి న్యాయస్థానాన్ని ఆ తల్లిదండ్రులు ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారించిన కోర్టు... ఇది తమ పరిధిలోకి రాదని పైకోర్టుకు వెళ్లాలని సూచించింది.