: షాకింగ్... రోడ్డు పక్కన టార్పాలిన్ టెంటులో నివసిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుటుంబం
పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లా... గర్హ్ శంకర్ పట్టణం. అక్కడ రహదారి పక్కన టార్పాలిన్ టెంటు వేసుకుని ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ప్రాంతంలో టెంట్లు, గుడిసెల్లో నివసించే వారు కనిపిస్తూనే ఉన్నప్పటికీ, ఈ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. అది కుటుంబ పెద్ద శింగార రాం షహుంగ్రా రెండు సార్లు ఎమ్మెల్యే కావడమే. బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ధనిక రాష్ట్రంగా పేరున్న పంజాబ్ లో రెండు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసి కనీసం ఓ ఇల్లు సంపాదించుకోలేకపోయిన ఏకైక వ్యక్తని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత వారంలో ఆయన ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్ ను పంజాబ్ సర్కారు ఖాళీ చేయించింది. ఆయన అందులో అక్రమంగా ఉంటున్నాడన్నది ప్రభుత్వ వాదన కాగా, నిలువ నీడలేని ఆ కుటుంబం ఇప్పుడు వీధిన పడింది. "మాజీ ఎమ్మెల్యేగా నాకు కేవలం రూ. 20 వేలు పెన్షన్ వస్తోంది. ఓ అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాను. అప్పటి వరకూ మాకు ఆకాశమే పైకప్పు" అని శింగార రాం వ్యాఖ్యానించారు. దివంగత బీఎస్పీ మహానేత కాన్షీరాం ఆఖరి రోజుల్లో ఆయన వెంట ఉన్నానన్న కారణంతో తనను బీఎస్పీ నుంచి వెలేశారని చెప్పుకొచ్చారు. కోర్టు ఆర్డర్ ఉందని చెబుతూ, పోలీసులు బలవంతంగా ఇంటి నుంచి ఖాళీ చేయించారని, నిమ్న కులాల అభ్యున్నతికి కృషి చేయడమే తన తప్పయిపోయిందని, ఏనాడూ తాను డబ్బు సంపాదించాలని భావించలేదని, అదే నేటి తన స్థితికి కారణమని ఆయన వాపోయారు.