: బరువెక్కిన హృదయాలు!... స్నేహ బంధాన్ని వీడలేక ‘తెలుగు’ ఉద్యోగుల కన్నీళ్లు!


హైదరాబాదులోని ఉమ్మడి సచివాలయంలో నేడు ఉద్వేగభరిత వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులంతా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలివెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 27లోగా ఏపీ సచివాలయ ఉద్యోగులంతా హైదరాబాదు వీడి అమరావతికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు శాఖల కార్యాలయాలు అమరావతికి తరలివెళ్లాయి. నేటి ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ఎక్కేందుకు కొన్ని శాఖల ఉద్యోగులు సిద్ధమయ్యారు. అప్పటిదాకా కలిసి మెలసి ఉన్న తెలంగాణ ఉద్యోగులను వీడడం వారిని కలచివేసింది. తీవ్ర ఉద్వేగానికి గురైన కొందరు మహిళా ఉద్యోగులు తమ స్నేహితులైన తెలంగాణ ఉద్యోగులను హత్తుకుని వెళ్లొస్తామని చెప్పారు. అలాగే తమ ప్రియ నేస్తాలు దూరమవుతున్న వైనం తెలంగాణ ఉద్యోగులను కూడా ఆవేదనకు గురి చేసింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మహిళా ఉద్యోగులు అక్కడ కన్నీటి పర్యంతమయ్యారు. అయినా ప్రభుత్వ ఆదేశాలు పాటించక తప్పని నేపథ్యంలో భారమైన హృదయాలతోనే ఏపీ ఉద్యోగులు బస్సెక్కగా, అంతకంటే భారమైన మనసులతో తెలంగాణ ఉద్యోగులు వారికి వీడ్కోలు పలికారు.

  • Loading...

More Telugu News