: అసలీ బ్రెగ్జిట్ గొడవ ఏంటి? యూకేలోని ఇండియన్స్ పై పడే ప్రభావం ఎంత?


యునైటెడ్ కింగ్ డమ్ లో చారిత్రాత్మక ప్రజా తీర్పునకు రంగం సిద్ధమైంది. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అన్న విషయమై ప్రభుత్వం రెఫరెండం కోరగా, ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు బారులు తీరారు. వాస్తవానికి ఈయూలో కొనసాగుతుండటం వల్ల దేశ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం ఏర్పడుతోందని పలువురు వాదిస్తుండటంతోనే ఈ సమస్య మొదలైంది. విదేశాల నుంచి బ్రిటన్ లోకి వస్తున్న వారి సంఖ్య ఏటికేటా పెరుగుతూ ఉండటం, వారంతా ఉద్యోగాల్లో చేరిపోతుంటే, బ్రిటన్ పౌరులకు ఉపాధి మృగ్యం అవుతుందన్నది కొందరి అభిప్రాయం. ఇదే సమయంలో బ్రిటన్ వ్యాపారులు డైరెక్ట్ బిజినెస్ చేసుకోలేకపోతున్నారని, ఎన్నో యూరప్ కంపెనీలు బ్రిటన్ లో వ్యాపారం చేసి లాభాలు పొందుతూ స్వేచ్ఛా వాణిజ్యం పేరిట పన్ను ఎగ్గొడుతున్నాయన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ రెండుగా చీలిపోగా, రెఫరెండం తప్పక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఓటింగ్ లో బ్రిటన్ విడిపోవాలని ప్రజలు తీర్పిచ్చి, అది జరిగితే, బ్రిటన్ లోని అసంఖ్యాక భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగితే, ఆ దేశపు వీసా ఆంక్షలు కఠినమవుతాయి. ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వుంటుంది. అక్కడ ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న భారత సంస్థలకు ఆదాయం తగ్గుతుంది. వలసవాదుల రూపంలో ఉగ్రవాదులు వస్తున్నారని, వీరి వల్ల దేశానికి భవిష్యత్తులో పెను ప్రమాదం ఏర్పడనున్న కారణంగా ఈయూలో వద్దే వద్దని బ్రెగ్జిట్ అనుకూల వర్గం, తమ వాదనను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. బ్రిటన్ లోని భారతీయులు మాత్రం యూనియన్ లోనే ఉండాలని కోరుతున్నారు. శైలేష్ ఓరా, వీరేంద్ర శర్మ, సీమా మల్ హోత్రా వంటి 15 మంది భారత ప్రజా ప్రతినిధులు ఈ మేరకు ప్రచారం చేశారు కూడా. బ్రిటన్ లో ఓటు హక్కున్న భారతీయుల్లో 52 శాతం మంది వ్యతిరేకంగా, 28 శాతం మంది అనుకూలంగా ఉన్నట్టు పోల్ సర్వేలు చెబుతున్నాయి. బ్రెగ్జిట్ వీగిపోతే ఏ సమస్యా ఉండదు కానీ, ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాల్సి వస్తే, అక్కడున్న భారతీయులు సహా, వివిధ దేశాల ఉద్యోగులు సమస్యల్లో చిక్కుకుంటారని నిపుణులు హెచ్చరించారు. వారి ఉద్యోగాల్లో కోతలు పడవచ్చని, వీసాపై వచ్చి పనులు చేస్తున్న వారిని కంపెనీలు వెనక్కు పిలిపించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రిటన్ లో జీవనం గడిపేందుకు వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఎందుకంటే, స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా బ్రిటన్ వాసులు ఫ్రెంచ్ వైన్, బెల్జియం బీర్, జర్మనీ కారు, లాటిన్ అమెరికా పండ్లు, యూరప్ లోని మిగతా దేశాల నుంచి పలు రకాల కూరగాయలను తక్కువ ధరలకు పొందుతుంటారు. యూనియన్ నుంచి వైదొలగితే, వాటి ధరలన్నీ పెరుగుతాయి. ఇక ఓ ఓ ప్లంబర్ కావాలన్నా పోలాండ్, బల్గేరియాల నుంచి తెప్పించుకోవల్సి వుంటుంది. లాభనష్టాలన్నీ బేరీజు వేసుకున్న బ్రిటన్ వాసుల్లో విద్యాధికులు, ఉద్యోగులు, యువత బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా ఉండగా, వయోవృద్ధులు, నైపుణ్యం లేని వారు, నేడో రేపో ఉద్యోగాలు కోల్పోయే స్థితిలో ఉన్నవారు, తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వారు అనుకూలంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News