: తెలంగాణాదే తొండివాదం... హరీశ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన దేవినేని
కృష్ణా నదీ జలాల పంపిణీపై నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిస్థితిని మరింత జటిలం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సూచనతో నిన్న రాత్రి ఓ దఫా, నేటి ఉదయం మరోమారు భేటీ అయిన దేవినేని, హరీశ్ లు... భేటీ ముగియగానే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. మొండి వైఖరితో ఏపీ వ్యవహరిస్తోందని హరీశ్ రావు ఆరోపిస్తూ దేవినేని వైఖరిపై నిప్పులు చెరిగారు. ఆ వెనువెంటనే మీడియా ముందుకు వచ్చిన దేవినేని హరీశ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వివాదం పరిష్కారానికి తాము సానుకూలంగానే ఉన్నా, తెలంగాణ తొండివాదం చేసిందని ఆయన ఆరోపించారు. తమ పరిధిలోని ప్రాజెక్టుల గేట్ల వద్ద తమ పోలీసులు పహారా కాయడాన్ని కూడా తెలంగాణ తప్పుబడుతున్నదని, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఏపీ వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. అదే సమయంలో తెలంగాణకు దక్కాల్సిన సింగిల్ నీటి బొట్టును కూడా తాము అడగడం లేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయంగా అందాల్సిన నీటి వాటాలకు గండి కొడుతున్న కర్ణాటక, మహారాష్ట్రలు... తెలంగాణ ప్రభుత్వానికి ఎలా మిత్రులుగా కనిపిస్తున్నాయో తమకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.