: గోవుల కళేబరాలను తరలిస్తున్న ట్రక్.. నిప్పు పెట్టిన స్థానికులు.. మధురలో ఉద్రిక్తత


ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోవుల కళేబరాలతో తరలుతున్న ఓ ట్రక్‌ను చూసిన స్థానికులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చౌముహన్ ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్ నుంచి రక్తం కారుతుండడాన్ని గమనించిన స్థానికులు ట్రక్‌ను పరిశీలించగా అందులో 30 ఆవు కళేబరాలు కనిపించాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు ట్రక్కుకు నిప్పుపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాతే ధర్నా విరమిస్తామని చెప్పడంతో డిప్యూటీ ఎస్పీ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. దోషులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ప్రజలు ఆందోళన విరమించారు. కాగా ఇటీవల మధురలో భూ ఆక్రమణదారులపై పోలీసులు కాల్పులకు దిగడంతో చెలరేగిన అల్లర్లలో 24మంది సహా ఓ ఎస్పీ మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News