: మోడల్ తో సెల్ఫీ ఎఫెక్ట్!... ‘హిలాల్’ కమిటీ నుంచి పాక్ మతపెద్ద ఔట్!
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారు. ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ మత పెద్ద మాత్రం... అందచందాలు ఒలకబోస్తూ ఇంటర్ నెట్ లో సెన్సేషనల్ గా మారిన ఓ మోడల్ తో ఏకంగా సెల్ఫీ దిగేశారు. సదరు ఫొటో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముస్లిం మత పెద్దకు భారీ షాక్ తగిలింది. ఈ తతంగమంతా పొరుగు దేశం పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... పాక్ కు చెందిన ‘రుయత్ ఏ హిలాల్’ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆ దేశ మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ ఖావి... పాక్ లో సెన్సేషనల్ మోడల్ గా పేరున్న ఖండీల్ తో సెల్ఫీ దిగారు. సదరు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ మోడల్ తో సెల్ఫీలేంటని ఖావిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సర్దుకున్న ఖావి... ఇఫ్తార్ విందుకు హాజరుకావాలన్న ఖండీల్ ఆహ్వానంతో ఓ హోటల్ కు వెళ్లానని, ఆ సందర్భంగానే సెల్ఫీ దిగానని చెప్పారు. అయితే అదంతా అబద్ధమని చెప్పిన ఖండీల్... తనను ఖావినే పిలిచారని తెలిపింది. ఎవరి వాదన ఎలా ఉన్నా... ఖావి చర్యను తీవ్రంగా పరిగణించిన హిలాల్ కమిటీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.