: ఎకరా రూ.1 చొప్పున 2,000 ఎకరాలు కావాలట!... అడాగ్ ప్రతిపాదనకు నో చెప్పిన ఏపీ సర్కారు!
రక్షణ రంగంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మొన్న విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో హామీ ఇచ్చిన అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్ (అడాగ్) ఏపీ సర్కారుకు ఓ విచిత్ర ప్రతిపాదన చేసింది. తాను నెలకొల్పే పరిశ్రమకు విశాఖ జిల్లా నక్కపల్లి పరిధిలో ఏకంగా 2,000 ఎకరాలు కావాలని చెప్పిన ఆ సంస్థ... ఆ భూమిని ఎకరాకు రూ.1 చొప్పున అందించాలని కోరింది. ఈ మేరకు ఆ సంస్థ నుంచి ఇటీవలే ఏపీ సర్కారుకు ఈ ప్రతిపాదన అందింది. దాదాపు ఉచితంగా అందే సదరు భూమిలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ చెప్పింది. అయితే ఎంతమేర ఉపాధి అవకాశాలు కల్పించినా... మరీ ఎకరా భూమిని రూ.1 ఎలా ఇస్తామంటూ ఏపీ సర్కారు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ఎన్ఐసీసీ) అడాగ్ కు షాకిస్తూ... సదరు ప్రతిపాదనను తిప్పికొట్టింది.