: ‘జంపింగ్’ల భుజాలు తట్టిన చంద్రబాబు!.. కరణం వైపు కన్నెత్తి చూడని వైనం!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్నటి ప్రకాశం జిల్లా పర్యటనలో వ్యవహరించిన తీరు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకే తెర లేపింది. రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీని ప్రారంభించేందుకు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లిన సందర్భంగా నిన్న చంద్రబాబు తనదైన స్టైల్లో పార్టీ వర్గాలకు ఝలక్కిచ్చారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్లపై విజయం సాధించి ఇటీవలే తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్ రెడ్డిలను పేరు పెట్టి పలకరించిన చంద్రబాబు... ఆ జిల్లాలో పార్టీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరాం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. వేదిక మీదకు ఎక్కగానే అక్కడ కనిపించిన కరణం బలరాంను చంద్రబాబు చూసీ చూడనట్లుగానే ముందుకెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించిన జిల్లా ఇన్ చార్జీ మంత్రి రావెల్ కిశోర్ బాబు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లను ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఇటీవల పార్టీలో చేరిన పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్ ల భుజాలపై చేతులు వేసి మరీ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు... ఆ పక్కనే ఉన్న ముత్తుముల అశోక్ రెడ్డిని కూడా నవ్వుతూ పలకరించారు. బలరాంను చూసీచూడనట్లుగానే వ్యవహరించిన చంద్రబాబు మిగిలిన వారి పట్ల మాత్రం ఆప్యాయత ఒలకబోయడంపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపితే క్షమించేది లేదంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు ఆ దిశగానే బలరాంను చూసీ చూడనట్లు వ్యవహరించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గొట్టిపాటి చేరికను చివరి దాకా అడ్డుకునేందుకు యత్నించిన బలరాం... మొన్నామధ్య బహిరంగంగా గొట్టిపాటి వర్గంతో వాదులాటకు దిగడంతో పాటు గన్ మెన్ ను కూడా తోసేసి, మోచేతితో పొడిచిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే బలరాం పట్ల చంద్రబాబు ముభావంగా వ్యవహరించారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.