: దళితులను పందులతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే... సోషల్ మీడియాలో వీడియో వైరల్!


దళితుల ఉద్ధరణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో పాటు మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయని చెబుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముంబయ్ శివారులోని దొంబివిలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ నేత రవీంద్ర చవాన్...ఈ నెల థానే జిల్లాలో పర్యటించిన సందర్భంగా దళితులను పందులతో పోల్చారు. దళితోద్ధరణకు తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రస్తావించిన రవీంద్ర... అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ పేరును ఉటంకించారు. మురుగు కాలువలో పడున్న పంది పిల్లను బయటకు తీసిన లింకన్ దానిని మంచి నీటితో కడిగారని చెప్పిన రవీంద్ర... దారిద్ర్యంలోని దళితులను ఆ పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని వ్యాఖ్యానించారు. రవీంద్ర వ్యాఖ్యలపై ఎన్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దళితులను పందులుగా అభివర్ణించిన అధికార పార్టీ ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలోకి ఎక్కేసిన రవీంద్ర ప్రసంగ వీడియో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన రవీంద్ర... తానేమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. సదరు వీడియోలో తన వ్యాఖ్యలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News