: ఢిల్లీ మెట్రోకు కాపలా బాధ్యతలు వీరనారీమణుల చేతుల్లోకి!
ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణిస్తూ నిత్యమూ వేధింపులకు గురై, ఎవరికి చెప్పుకోవాలో తెలీక వేదనపడే మహిళలకు ఊరట కలిగించే వార్త. ఇకపై ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలే పూర్తి భద్రతను చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. సుశిక్షితులైన వీర నారీమణులు ఇకపై మెట్రో రైళ్లలో భద్రతను పర్యవేక్షిస్తుంటారని, వీరికి ఆయుధాలు వాడటం నుంచి మార్షల్ ఆర్ట్స్ వరకూ తెలుసునని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా కన్నాట్ ప్లేస్ లో మహిళలతో కూడిన 'ఇంటర్నల్ కాంబాట్ గ్రూప్' తన శక్తి యుక్తులను ప్రదర్శించారు. ఢిల్లీలో మెట్రోల భద్రత కోసం సీఐఎస్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ తదితరాల్లో శిక్షణ పొందిన వారూ ఉంటారని అధికారులు తెలిపారు.