: ఫుట్ బాల్ అభిమానుల వేషాల్లో కిల్లర్లను పంపుతున్న రష్యా: ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన ఆరోపణ


యూరో 2016 పోటీల్లో అభిమానుల ముసుగులో రష్యా శిక్షణ ఇచ్చిన హంతకులను పంపుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరోషన్కో తీవ్ర విమర్శలు చేశారు. పోటీల సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవలు, ఆపై విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ, "వారు ముందుగానే ప్రణాళికల ప్రకారం వచ్చారు. వారంతా శిక్షణ పొందిన వారే. కావాలనే జగడాలు పెట్టుకుని, తమ ప్రావీణ్యాన్ని అమాయకులపై చూపుతున్నారు" అని ఆరోపించారు. ఇటీవల మార్సెల్లీలో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు బ్రిటన్ జాతీయులు తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లగా, 35 మంది వరకూ క్రీడాభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు రష్యన్లు, ఆరుగురు ఇంగ్లండ్ వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అభిమానులు, కావాలనే ఇంగ్లండ్ మద్దతుదారులను వెతికి మరీ గాయపరిచారని ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు కోర్టులో ఆరోపించడంతో ముగ్గురు రష్యా వాసులకు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ, మరో ఇద్దరు ఆ దేశ అభిమానులను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు కోర్టు తీర్పిచ్చింది. కాగా, జరిగిన ఘటనలపై వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ, ఇది దురదృష్టకరమైన ఘటనని అంటూనే, కేవలం 200 మంది వరకూ మాత్రమే ఉన్న తమ పౌరులు, వేలాదిగా ఉన్న ఇంగ్లీష్ వారిపై ఎలా దాడులు చేశారో తెలియడం లేదని అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరపలేదని భావిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News