: ముద్రగడ కిర్లంపూడిలో దీక్ష విరమిస్తానన్నారు: వైద్యులు
కాపు రిజర్వేషన్ ఉద్యమ ఐక్యవేదిక నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించేందుకు అంగీకరించారని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్న వైద్యులు తెలిపారు. అయితే ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో దీక్షను విరమించాలని భావిస్తున్నారని వారు తెలిపారు. అదే సమయంలో ముద్రగడ సతీమణి ఆసుపత్రిలో దీక్ష విరమిస్తారని వారు వెల్లడించారు. కాగా, దీనిపై ముద్రగడ లేదా జేఏసీ తరపునుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 14 రోజులుగా దీక్ష చేపడుతున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ముద్రగడకు ఏదైనా జరిగితే తీవ్రపరిణామాలుంటాయని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు.