: పోలీస్ స్టేషన్ ను మసాజ్ సెంటర్ చేసిన ఎస్సై...సోషల్ మీడియాలో వైరల్
సోషల్ మీడియాతో మంచీ చెడు రెండూ ఉన్నాయి. సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే సోషల్ మీడియా కంటే అద్భుతమైన సాధనం ఇంకోటి లేదనడంలో అతిశయోక్తి కాదు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలోని హర్దాయ్ జిల్లా కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ ను ఎస్సై సంజయ్ యాదవ్ మసాజ్ సెంటర్ గా మార్చేసిన నిర్వాకాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటాడో వ్యక్తి. దీంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే...ఎస్సై సంజయ్ యాదవ్ అర్ధ నగ్నంగా కూర్చుని ఓ మహిళతో ఒళ్లు పట్టించుకున్నాడు. అదే సమయంలో ఆయన కాళ్లను మరో వ్యక్తి మసాజ్ చేశాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి 'పోలీస్ స్టేషన్ లో మసాజ్...ఎస్సై నిర్వాకం' అంటూ సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. అంతే, నెటిజన్లు భగ్గుమన్నారు. పోలీసుల వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఆమె ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ అని, మసాజ్ చేస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తానని చెప్పడంతో ఆమె అలా చేసిందంటూ స్థానిక మీడియా దీనిని ప్రసారం చేయడంతో, ఇది పోలీసు బాసులకు చేరడంతో అతనిని సస్పెండ్ చేశారు. ఈ తతంగంపై పోలీసు అధికారులు మాట్లాడుతూ, ఎస్సై గారికి కీళ్లనొప్పులు ఉన్నాయని, ఆమె ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ కాదని, ఆయన కాళ్లు పట్టింది, నిందితుడు కాదని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అంటే మౌనం వహించారు.