: సర్దార్ పటేల్ విగ్రహానికి తుపాకుల దండ వేసిన మాజీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ డీజీ వంజార!
తాను విధుల్లో ఉన్న సమయంలో ఎన్నో ఎన్ కౌంటర్లు చేసి వార్తల్లో నిలిచి, ఆపై పదవీ విరమణ చేసిన గుజరాత్ పోలీసు అధికారి డీజి వంజార, సూరత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బొమ్మ తుపాకులతో తయారు చేసిన దండ వేసి మరో వివాదానికి తెరతీశారు. ఆయన మద్దతుదారులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వంజార, పటేల్ విగ్రహానికి పూల మాల వేసే బదులు, తుపాకులు, పెన్నులు కట్టిన దండను వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, తాను ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసేందుకే ఈ పని చేశానని, ఓ నిజమైన జాతీయవాదిగా, పటేల్ ఎన్నో సంస్థానాలను దేశంలో విలీనం చేశారని, దాన్ని గుర్తు చేసుకునేందుకే ఈ పని చేశానని తెలిపారు. అస్త్రశస్తాలతో ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారని కొనియాడారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇష్రాత్ జహాన్, సోహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్లు వంజార హయాంలోనే జరుగగా, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు.