: 'ఏరువాకా సాగాలో...' అంటున్న చంద్రబాబు బృందం!


జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ... రైతులు పొలం పనులను ప్రారంభిస్తూ ఏరువాక పండగ జరుపుకునే రోజు. నైరుతీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై పూర్తిగా విస్తరించిన వేళ, రైతులు ఆనందంతో మేడి పట్టి దుక్కి దున్నేందుకు సిద్ధం కాగా, చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ వైభవంగా నిర్వహించేందుకు నడుం బిగించింది. కృష్ణా జిల్లాలో చంద్రబాబు స్వయంగా ఏరువాకకు కదులుతుండగా, జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రైతులు తమ ఎడ్లబండ్లను అందంగా అలంకరించి పొలాల వైపు నడిపిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంలో ఏరువాక కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత గంగపూజ నిర్వహించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని గంగమ్మను ఆమె కోరారు. ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్ధా రాఘవరావు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి రైతులతో కలిసి ఏరువాకలో పాల్గొన్నారు. కాగా, మరికాసేపట్లో నరసాపురంలో జరిగే ఏరువాక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పరిశీలించారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా సేవలందించి దివంగతులైన ఎంవీ రావు పొలంలో నాగలిపట్టి చంద్రబాబు దుక్కి దున్నుతారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఇన్ చార్జీలు, మహిళా రైతులు, రైతు మిత్ర గ్రూప్ లు, ప్రగతి శీల రైతులు భాగం కానున్నారు. దుక్కి దున్నే ముందు సంప్రదాయ కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతాయని వివరించారు.

  • Loading...

More Telugu News