: ఆ సమయంలో తిట్లు తప్పించుకునేందుకు తల దించుకుని కూర్చుంటా: నితిన్ గడ్కరీ
మంత్రులు, వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ, పోలీసులు ట్రాఫిక్ ను ఆపే సమయాల్లో ప్రజలు ఎంతో తిట్టుకుంటుంటారని, అలాంటి సందర్భాల్లో, వారి తిట్లు, చీత్కారాల నుంచి తప్పించుకునేందుకు కారులో తలదించుకుని కూర్చుంటానని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో గడ్కరీ ప్రసంగించారు. మంత్రుల వద్ద పనిచేసే కొందరు పీఏల అత్యుత్సాహం కూడా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుందని చెప్పారు. తాను నాగపూర్ కు రైల్లో వెళుతున్న వేళ, తన వ్యక్తిగత సహాయకుడు, తనకు తెలియకుండానే స్టేషన్ మేనేజర్ కు ఫోన్ చేసి రైలును మొదటి ప్లాట్ ఫాంపై పెట్టాలని కోరాడని, తన కాలికి గాయం అయిందని అబద్ధం చెప్పాడని, దీంతో తాను కొంత ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. మంత్రులు ఎప్పటికైనా మాజీలు అవుతారని, వారి కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టరాదని సూచించిన ఆయన, స్వలాభం చూసుకోకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసే కార్యకర్తలు మరింత వేగంగా ఎదుగుతారని చెప్పారు.