: పాకిస్థాన్ లో పరువు హత్యల పరంపర.. మరో ముగ్గురి హత్య.. మృతుల్లో నిండు గర్భిణి!


పరువుహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న పాకిస్థాన్ లో తాజాగా అటువంటివే మరో రెండు ఘటనలు వెలుగుచూశాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో మొత్తం ముగ్గురు మృతి చెందగా అందులో నిండు గర్భిణి ఉండడం మరింత విషాదం. రెండు రోజుల క్రితం తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కుమార్తెను కన్నతల్లే దారుణంగా హత్య చేసిన ఘటన మరిచిపోకముందే ఈ ఘటనలు జరగడం గమనార్హం. పంజాబ్ ప్రావిన్స్ లోని ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన నస్రీన్ షహజాదీ(25) మూడు నెలల క్రితం తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం ఆమె ఇస్లాం స్వీకరించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఇటీవల ఆమెకు ఫోన్ చేసిన తల్లిదండ్రులు భర్తతో కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. స్వయంగా తల్లిదండ్రులే ఫోన్ చేసి పిలవడంతో శనివారం ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో పొడిచిచంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ నిర్జన ప్రదేశంలో పడేశారు. మరో ఘటనలో ముహమ్మద్ షకీల్(30), ఆమె భార్య, నిండు గర్భిణి అయిన అక్సా(26)ను కాల్చి చంపారు. నాలుగేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి వీరు పెళ్లి చేసుకున్నారు. దీనిని సహించలేని అక్సా సోదరుడు వారిని హత్య చేసేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన ఆయన నాలుగు రోజుల క్రితం తల్లి, మేనమామతో కలిసి సోదరి ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. దంపతులను చితకబాదారు. అనంతరం వారిని ఓ గుర్తుతెలియని ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి కాల్చి చంపారు. ఓ కెనాల్ లో వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మరో నాలుగు రోజుల్లో అక్సా పండంటి బిడ్డకు జన్మనిచ్చేదని, అంతలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కన్న తల్లే గర్భిణి అయిన కుమార్తె(22)ను పాశవికంగా చంపేసింది. గతవారం 18 ఏళ్ల కూతురిని సజీవంగా దహనం చేసిందో తల్లి. పరువు హత్యలు ఇక్కడ అత్యంత మామూలు విషయం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది పాక్ లో 1100 మంది ఇలా పరువుహత్యలకు గురయ్యారు.

  • Loading...

More Telugu News