: ఎన్ఎస్జీ కోసం ఇండియాకు మద్దతిస్తాం: రష్యా అధ్యక్షుడు పుతిన్
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వం కోసం తాము మద్దతిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. సియోల్ లో వచ్చే వారంలో జరిగే సమావేశంలో భారత్ కు సభ్యత్వం ఇచ్చే విషయంలో చర్చ జరుగనుండగా, తమ దేశం మద్దతిస్తుందని ఆయన తెలిపారు. ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 48 సభ్యులున్న ఎన్ఎస్జీ ప్యానల్ లో చైనా, భారత్ కు సభ్యత్వంపై వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. న్యూక్లియర్ పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకునే స్థాయికి ఇండియా చేరుకుందని భావిస్తున్నామని, అంతర్జాతీయ చట్టాలకు లోబడే తమ మద్దతు ఉంటుందని పుతిన్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే అమెరికా సైతం భారత్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్జీ సభ్య దేశాలన్నీ ఇండియాకు సపోర్టివ్వాలని అధ్యక్షుడు ఒబామా విజ్ఞప్తి చేశారు కూడా.