: కేసీఆర్ తన ఫాం హౌస్ లోని భూమిని ఎకరా 10 లక్షల రూపాయలకు ఇస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ లోని భూమిని ఎకరా 10 లక్ష రూపాయల చొప్పున ఇస్తారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే, మంత్రి హరీష్ రావు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్న దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో ద్వారా బాధితులకు న్యాయం జరగదని ఆయన తెలిపారు. ఈ జీవోలో పరిహారం, పునరావాసం తదితర అంశాలు లేవని ఆయన అన్నారు. నిర్వాసితులకు ఎకరాకు 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అమలు చేసి, నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.