: ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ: వెంకయ్యనాయుడు
భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికైన అనంతరం మొదటిసారి హైదరాబాద్కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు సన్మానం చేశారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. భారత్లో భౌగోళికంగా చూస్తే 46 శాతం బీజేపీనే విస్తరించి ఉందని అన్నారు. ప్రజల్లో బీజేపీపై ఉన్న నమ్మకం ఏ మాత్రం తగ్గలేదని, బెంగాల్లోనూ తమకు 10.7 శాతం ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ కలసి పోటీ చేసినా తమకు అధిక శాతంలోనే ఓట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కేరళలోనూ బీజేపీ 14.5 శాతం ఓట్లు సాధించిందని ఆయన అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన అన్నారు. మోదీ మేనియా ఏ మాత్రం తగ్గలేదని, తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వానినే ప్రజలు ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన చెప్పారు. ఆర్థిక రంగంలో భారత్ మెరుగైన అభివృద్ధిని సాధిస్తోందని తెలిపారు. బీజేపీ తనను ఎంతో ఎదిగేలా చేసిందని వెంకయ్య నాయుడు అన్నారు. ఆ పార్టీ తనకు కన్న తల్లి లాంటిదని ఆయన అభివర్ణించారు. పదవుల్లో లేకున్నా బీజేపీ కోసం ఎంతో మంది నేతలు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి పేరుందని ఆయన అన్నారు.