: డబ్బు తీసుకోలేదని నా కొడుకుపై ప్రమాణం చేస్తా... మరి జగన్ కూడా చేస్తారా?: పలమనేరు ఎమ్మెల్యే సవాల్


డబ్బు తీసుకుని టీడీపీలో చేరుతున్నారంటూ చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్ నాధ్ రెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ పత్రిక రాసిన కథనాలు నిన్న విజయవాడలో ఘాటు వ్యాఖ్యలకు కారణమయ్యాయి. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పలమనేరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అమర్ నాథ్ రెడ్డి నిన్న విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిలెక్కేశారు. ఆ తర్వాత ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక కథనాలపై ఫైరయ్యారు. టీడీపీలో చేరేందుకు తాను సింగిల్ పైసా తీసుకోలేదన్నారు. ఈ మేరకు తన ఒక్కగానొక్క కుమారుడిపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. మరి తాను డబ్బులు తీసుకున్నట్లు జగన్ ప్రమాణం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పత్రిక ఉంది కదా అని ఏది రాసినా చెల్లుతుందని అనుకోవద్దని ఆయన జగన్ కు సూచించారు. అయినా అమర్ నాథ్ రెడ్డి అంటే ఏమిటో జగన్ కు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. తనను మరింత ఇబ్బంది పెట్టి తన నోటికి పనిచెప్పవద్దని విపక్షానికి సూచించారు.

  • Loading...

More Telugu News