: కేంద్ర కేబినెట్ విస్తరణకు వేళాయే!... ఎన్నికలున్న రాష్ట్రాల ఎంపీలకు బెర్తులు!
కేంద్ర కేబినెట్ ను విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ నెల 22ను ముహూర్తంగా ఆయన నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. జాతీయ, ప్రాంతీయ మీడియాలో ఈ దిశగా వెల్లువెత్తుతున్న వార్తా కథనాల ప్రకారం... ప్రధానంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో బెర్తులు దక్కనున్నాయి. ఇక ఇటీవలే ఎన్నికలు ముగిసిన బీహార్ లాంటి రాష్ట్రాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన పలకనున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే నేతలకు పార్టీలో కీలక పదవులిచ్చి బుజ్జగించనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్వ్యవస్థీకరణలపై ఓ దఫా చర్చలను పూర్తి చేశారు. కేబినెట్ లోకి తీసుకోవాల్సిన ఎంపీలను షార్ట్ లిస్ట్ చేసిన వీరిద్దరూ... కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే నేతలకు పార్టీ పదవులను కూడా ఖరారు చేశారు. కేబినెట్ విస్తరణలో భారీ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. పలు కీలక శాఖల మంత్రులకు స్థాన చలనం తప్పదన్న వాదన కూడా వినిపిస్తోంది.