: నెల్లూరులో బీజేపీ నేతకు వైసీపీ సాదర స్వాగతం!... ఆసక్తికర చర్చకు తెర తీసిన వైనం!
ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన పూర్తైన నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా ‘వికాస్ పర్వ్’ పేరిట విజయోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న నెల్లూరులో వికాస్ పర్వ్ సభ జరిగింది. ఈ సభకు ‘మిస్టర్ క్లీన్’గా పేరుపడ్డ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులో ల్యాండైన పారికర్ కు బీజేపీ, దాని మిత్రపక్షం టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక ఆ రెండు పార్టీల నేతలతో పాటే హెలిప్యాడ్ వద్దకు వచ్చిన వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా పారికర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. మేకపాటి వెంట ఆయన అనుచరులు, కొందరు వైసీపీ నేతలు కూడా అక్కడ దర్శనమిచ్చారు. బీజేపీ నేతకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు రావడం పెద్ద చర్చకే దారి తీసేలా ఉంది.