: నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కోరుకున్నారు.. ఆ కలని నెరవేరుస్తున్నాం: హరీశ్ రావు
తెలంగాణ ప్రజలు ఏ ఆశని నెరవేర్చుకోవాలని ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారో ఆ కల నెరవేరుతోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్‌లో పర్యటిస్తోన్న ఆయన ఈరోజు వేముల వాడలోని గుడిచెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.62కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రెండేళ్లలో 17వేల చెరువులకు పూర్వ వైభవం వచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, ఉద్యోగాల కలను తాము నెరవేరుస్తున్నామని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మహిళల విద్యకూ పెద్దపీట వేసిందని, ఈ ఏడాది 30 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయని ఆయన చెప్పారు.