: ఇటీవలి లాభాలు హుష్ కాకి... భారీ నష్టంలో స్టాక్ మార్కెట్
యూఎస్ ఫెడ్ సమావేశం భయాలు, రుతుపవనాలు ఆలస్యం అవుతుండటం, పెరిగిన ద్రవ్యోల్బణం వంటి స్టాక్ మార్కెట్ వ్యతిరేక అంశాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ హరించగా, ఇటీవలి స్టాక్ మార్కెట్ లాభాలు మాయమయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో సాగిన వేళ అదే దారిలో భారత ఈక్విటీలు పయనించాయి. బుధవారం నాడు 330 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్, నేడు 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ-50 130 పాయింట్లు పడిపోయి, అత్యంత కీలకమైన 8,100 స్థాయి నుంచి దిగజారింది. ప్రపంచ మార్కెట్లలో ఇంకా అనిశ్చితి తొలగలేదని, చైనా మాంద్యం, యూరో జోన్ నుంచి బ్రిటన్ వైదొలగుతుందన్న అంశాలు ఈక్విటీల కొనుగోలుకు అడ్డంకిగా మారాయని అంబిత్ క్యాపిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా వ్యాఖ్యానించారు. కాగా, నేటి సెషన్లో ఎన్ఎస్ఈలో 6 కంపెనీలు మాత్రమే లాభాల్లో సాగుతున్నాయి.