: రాష్ట్రపతి పాలనకు విపక్షాల యత్నం!... కుట్రపై అప్రమత్తం చేసిన ఒవైసీ: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా నిన్న తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు యత్నించాయని ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాగానే టీడీపీ, కాంగ్రెెస్ లు కుట్ర రాజకీయాలకు తెర తీశాయని ఆయన ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నించిన ఆ రెండు పార్టీలు... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పెట్టించే పన్నాగం పన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాము ఈ కుట్రలను పసిగట్టలేకపోయామని కూడా కేసీఆర్ అన్నారు. ఈ సమయంలోనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనకు ఫోన్ చేసి మరీ ఈ కుట్రలను వివరించారని ఆయన అన్నారు. విపక్షాల కుట్రలపై అప్రమత్తం చేయడంతోనే సరిపెట్టుకోని ఒవైసీ... విపక్షాల కుట్రలకు చెక్ పెట్టేలా తమకు అండగా నిలుస్తామని చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.