: తమ్ముడూ, చెల్లితో కలిసి రోడ్డెక్కిన రెండేళ్ల చిన్నారి... బాలల సాహసగాథ!
ఒంటిపై డైపర్ మినహా మరేమీ బట్టలు కూడా లేని రెండేళ్ల చిన్నారి, తన తమ్ముడు, చెల్లితో కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డెక్కింది. అంతేనా, అలా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటన దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో జరుగగా, ఇప్పుడు వారి సాహసయాత్ర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తల్లి ఇంట్లో నిద్రపోతున్న వేళ, తండ్రి బయట తలుపు వేయకుండా వెళ్లిపోవడంతో ఆ బాలిక వాళ్లను తీసుకుని బయటకు వచ్చింది. ముద్దులొలికే ముగ్గురు చిన్నారులు బయట దర్జాగా నడుస్తూ వెళుతుంటే, చూసిన కొందరు వారికి చాక్లెట్లు ఇచ్చారట. ఆపై ఇంకెవరో పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారిని స్టేషనుకు చేర్చిన పోలీసులు చాలా సేపు వారి ఆలనా, పాలనా చూస్తూ గడపాల్సి వచ్చింది. ఆపై వారి తల్లి స్టేషనుకు వచ్చి విషయాన్ని చెప్పగా, వివరాలను పోల్చుకున్న అనంతరం బిడ్డలను తల్లికి అప్పగించారు. వీరంతా ఉండేది ఆరో అంతస్తులో ఉన్న ఓ అపార్టుమెంటులో. ముగ్గురు పిల్లలు అన్ని మెట్లు దిగి ఎలా రోడ్డెక్కారన్నది ఇప్పటికీ అంతుబట్టకుండా ఉంది. పిల్లల్ని పట్టించుకోకుండా హాయిగా నిద్రపోయిన తల్లిని కొందరు విమర్శిస్తుంటే, ఆమె తప్పేముందిలే, పిల్లలు సాహసయాత్ర చేశారని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.