: వర్షాలు వస్తాయో? రావో?... అధికారులు చురుగ్గా పనిచేయాలి: చంద్రబాబు


"రుతుపవనాలు వస్తున్నాయి. వర్షించకుండానే పోతున్నాయి. స్థిరంగా కొనసాగడం లేదు. చాలినన్ని వర్షాలు కురుస్తాయో... కురవవో! అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చురుగ్గా పనిచేయాలి" అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడ నుంచి నీరు-చెట్టు, పంట సంజీవనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, రుతుపవనాలు మరింత జాప్యమైతే, రైతాంగం నష్టపోయే ప్రమాదముందని, వారిలో దిగులు పెరగకుండా చూసుకోవాలని సూచించారు. పంట కుంటల తవ్వకం, రెయిన్ గన్స్ ఏర్పాటులో జాప్యం చేయవద్దని, అధికారులు ఎవరైనా అలసత్వం ప్రదర్శించారని తెలిస్తే, కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. వర్షాలు తక్కువగా ఉన్నా, పంట కుంటల్లోకి నీరు చేరితే, రెయిన్ గన్స్ వాడకం సత్ఫలితాలను ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాలు పడినా ఎక్కడా చెరువు కట్టలు తెగకుండా కరకట్టలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. అన్ని చెరువులను కలెక్టర్లు సందర్శించాలని సూచించారు. రైతులు సీజన్ కోల్పోకుండా, పంటలు సకాలంలో పండే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు జీవన భద్రత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆహారం, నీరు, విద్యుత్, పశుగ్రాసం, సైబర్, విజ్ఞాన భద్రత లక్ష్యాలుగా ప్రభుత్వాధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు.

  • Loading...

More Telugu News