: ఏడుగురు వైట్ హౌస్ ఉద్యోగినులపై అత్యాచారం... వెల్లడించిన ఉపాధ్యక్షుడు బిడెన్!
అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో పనిచేసే ఏడుగురు మహిళలు తాము అత్యాచారానికి గురైనట్టు ఫిర్యాదు చేశారని అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ స్వయంగా వెల్లడించడం సంచలనం కలిగించింది. వైట్ హౌస్ ఉద్యోగుల పిక్నిక్ సందర్భంగా కలిసినప్పుడు, మహిళలంతా వరుస కట్టి మరీ తన వద్దకు వచ్చి వారికి ఎదురైన దురదృష్టకర అనుభవాలను చెప్పుకున్నారని యూఎస్ ఉమెన్ సమ్మిట్ లో ఆయన అన్నారు. లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడం తమకు అత్యంత ప్రాధాన్యకరమైన అంశమని చెప్పిన ఆయన, బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తుండటం, సమాజంలో మార్పునకు సంకేతమని అన్నారు. "ఏడుగురు యువతులు నా వద్దకు వచ్చి, ధ్యాంక్యూ... నన్ను రేప్ చేశారు. చెప్పుకుంటే ఎవరూ వినరని నాకు తెలుసు" అని వాపోయారని చెప్పిన ఆయన, తమ గోడు ఎవరైనా వింటారేమోనన్న ఆశ మహిళల్లో ఉన్నదని చెప్పేందుకే ఈ విషయాన్ని బహిర్గతం చేసినట్టు బిడెన్ తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న వైట్ హౌస్ ఉద్యోగిని మెగాన్ యాప్ మాట్లాడుతూ, "నాపై దాడి చేసిన వ్యక్తిని ప్రతిఘటించే శక్తి నాకు లేదు. అత్యాచార సంస్కృతిని రూపుమాపే అధికారం నా వద్ద లేదు. అయితే, ఈ విషయంలో నేను ఏదో ఒకటి చేయగలను అని మాత్రం తెలుసు" అంటుండగా, సదస్సు జరిగిన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక ఇప్పుడు వైట్ హౌస్ లో ఆడవారిపై జరిగిన అత్యాచారాలపై ఫెడరల్ విచారణకు పలువురు డిమాండ్ చేస్తున్నారు.