: బర్త్ డే కేక్ పై ఒవైసీ బొమ్మ!... కత్తి చేతబట్టి కట్ చేసిన రాజ్ ఠాక్రే!
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే నిన్న తన 48వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. సెంట్రల్ ముంబైలోని దాదర్ లోని తన ఇల్లు ‘కృష్ణ కుంజ్’లో జరిగిన బర్త్ డే వేడుకల్లో ఆయన అభిమానులు తెచ్చిన ఓ కేక్ ను కట్ చేశారు. ఇందులో విశేషం ఏముందంటారా? అభిమానులు తెచ్చిన కేక్ పై మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ బొమ్మ ఉంది. ఒవైసీతో ఢీ అంటే ఢీ అంటూ గతంలో ఘాటు హెచ్చరికలు చేసిన ఠాక్రే... నిన్న ఒవైసీ బొమ్మతో ఉన్న కేక్ ను ఆయన ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. ఆ తర్వాత అభిమానులందరికీ దానిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా... ఈ కేక్ మాదిరే ముక్కలు ముక్కలు చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.