: టీఆర్ఎస్ పై చంద్రబాబు ఫైర్!... తలకిందుల పనులు చేస్తూ తనను తిడతారేమని ఆగ్రహం!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై ఫైరయ్యారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను వదిలేసి కొత్త ప్రాజెక్టులను కడతామంటూ ప్రకటనలు గుప్పించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అనవసరంగా తనను తిడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మొన్న హైదరాబాదుకు వచ్చిన చంద్రబాబు నిన్న ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో టీ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారుపై వ్యవహరిస్తున్న వింత వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు. ‘‘తెలంగాణలో నిర్మాణంలో చాలా ప్రాజెక్టులున్నాయి. వాటిని పూర్తి చేసే విషయం పక్కనపెట్టి, కొత్తవి కడతామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తోంది. వాటికి ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని నిందలేస్తోంది. ఏ ప్రభుత్వం అయినా ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాని వల్ల రైతులకు త్వరగా నీరు అందుతుంది. కానీ ఇక్కడ అందుకు వ్యతిరేకంగా వ్యవహారం నడుస్తోంది. ఈ తలకిందుల వ్యవహారం ఏమిటని ప్రశ్నించండి. తప్పేముంది? తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటానంటే నేను వద్దన్నది లేదు. అడ్డు పడిందీ లేదు. ఉమ్మడి రాష్ట్ర విభజనలో వివిధ అంశాలపై మార్గదర్శకత్వానికి ఓ చట్టం తెచ్చారు. ఆ చట్టం చేసేటప్పుడు మనలను ఎవరూ అడగలేదు. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారమే ఉభయ రాష్ట్రాలు వ్యవహరించాలని నేను కోరాను. కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే ఏ నిబంధనలు అనుసరించాలో ఆ చట్టంలో ఉంది. దాని ప్రకారమే వెళ్లాలని సూచించాను. నాకు రెండు రాష్ట్రాలు సమానం. టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం కావాలి. వాళ్లు అడిగిన వాటన్నింటికీ ఒప్పుకున్నా. ఇంకేదో విషయం తీసుకుని నన్ను తిడుతూనే ఉంటారు. అలా రెచ్చగొడితేనే ప్రజల్లో వారికి పట్టు ఉంటుందన్నది వారి రాజకీయ కోణం. దానిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లండి’’ అని ఆయన టీ టీడీపీ నేతలకు సూచించారు.

  • Loading...

More Telugu News