: యూనిట్ ను మూసేసినా కోకా-కోలాకు తప్పని తిప్పలు... కేరళలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సాఫ్ట్ డ్రింక్ దిగ్గజం కోకా-కోలాకు కేరళలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బహుళ జాతి సంస్థగా సత్తా చాటుతున్న ఈ అమెరికా కంపెనీపై కేరళలోని మీనాక్షిపురం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో అవసరమనుకుంటే కంపెనీ ఇండియా చీఫ్, కేరళ ప్రాంతీయ అధికారి, ప్లాచిమాడ ప్లాంట్ అధికారికి సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయి. వివరాల్లోకెళితే... కేరళలోని ప్లాచిమాడలో చాలా కాలం క్రితం యూనిట్ ను ఏర్పాటు చేసిన కోకా-కోలా... సదరు యూనిట్ నుంచి వెలువడే వ్యర్థాలను సమీపంలోని దళిత వాడలోకి డంప్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు ఎదురు కావడంతో సదరు యూనిట్ ను కంపెనీ 2004లోనే మూసేసింది. అయితే కంపెనీ నుంచి పరిహారం కోరుతూ ప్లాచిమాడ సమర సమితి.. మీనాక్షిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కంపెనీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వీఎస్ శ్యామ్ కుమార్ తెలిపారు. నిన్న నమోదైన ఈ కేసుపై వెనువెంటనే స్పందించేందుకు కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు. పూర్తి వివరాలు తెలుసుకుని రేపు (నేడు) స్పందిస్తామని ఆ కంపెనీ నిన్న తెలిపింది.