: కన్న తల్లే అమ్మేసింది... అంగడి బొమ్మగా మారింది... ఆటో ప్రమాదంతో తప్పించుకుంది!


కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న తల్లి ఆ పదకొండేళ్ల బాలిక పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి అమ్మేసింది. ఆపై కామాంధుల లైంగిక వేధింపులకు గురై తీరని బాధను అనుభవించింది. చివరికి తాను ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురి కావడంతో చిక్కుల్లో నుంచి బయటపడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లో నివసించే దంపతులకు ఓ కుమార్తె ఉంది. వీరి మధ్య విభేదాలు రావడంతో తల్లి మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండగా, అతను కామాంధుడై కూతురి వరసైన బాలికను చెరబట్టాడు. కన్నతల్లికి చెబితే, బెదిరింపులే ఎదురయ్యాయి. బాలికను వదిలించుకోవాలని భావించిన ఆమె, విజయవాడకు చెందిన మహిళకు విక్రయించగా, ఆపై ఆమె మంగళగిరికి చెందిన మహిళకు, ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె చీరాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న వాణి అనే యువతికి విక్రయించింది. వాణి ఆమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టగా, ఓ హోంగార్డు, వాణి ప్రియుడు జితిన్ లాల్, మరికొందరు ఆమెపై అత్యాచారం చేశారు. గత వారంలో వాణి, బాలిక గుడికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకుని చిలకలూరిపేట చేరింది. అక్కడి స్థానికులు బాలిక పరిస్థితిని చూసి, పోలీసులకు సమాచారం ఇవ్వగా, చీరాల సీపీడీఓ నాగమణి ఆశ్రయమిచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు హోంగార్డును, జితిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News