: మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులకు రంగం సిద్ధం... ఇంటర్ పోల్ సందేహాలను నివృత్తి చేసిన ఈడీ
మొత్తం 17 బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కిర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మాల్యాను ‘ప్రొక్లెమ్ డ్ అబ్ స్కాండర్’ గా ప్రకటించాలని ముంబైలోని ఓ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టడంతో పాటు ఈడీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. మరోవైపు మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులకూ రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఇంటర్ పోల్ కు ఈడీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలపాలంటూ ఇంటర్ పోల్ నుంచి ఈడీకి ఓ లేఖ వచ్చింది. సదరు లేఖను సాంతం పరిశీలించిన ఈడీ అధికారులు ఇంటర్ పోల్ కోరిన మొత్తం సమాచారాన్ని పొందుపరుస్తూ నిన్న ప్రత్యుత్తరమిచ్చింది. దీంతో నేడో, రేపో మాల్యాపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.