: యూపీఏ హయాంలో ప్రైవేటు విమానయాన సంస్థలకు లబ్ధి చేకూర్చారు!: విచారణ జరిపిస్తామన్న అశోక గజపతిరాజు
కేంద్రంలో యూపీఏ పాలన సాగిన రోజుల్లో కొన్ని ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలకు లబ్ధిని కలిగించే నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపించనున్నట్టు కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు వెల్లడించారు. ఈ నిర్ణయాలతో విదేశీ ఎయిర్ లైన్స్ సంస్థలకు లాభం చేకూరగా, దేశవాళీ సంస్థలు, ప్రధానంగా ఎయిర్ ఇండియా నష్టపోయిందని ఆయన అన్నారు. "గత ప్రభుత్వ హయాంలో కొన్ని నిర్ణయాలు దేశానికి నష్టం కలిగించాయి. తప్పు తప్పే. అది కావాలని చేసినా, తెలియక చేసినా చట్టం విచారిస్తుంది. నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. తప్పెవరిదన్న సంగతిని విచారణ సంఘాలు తేలుస్తాయి" అని అశోక గజపతి రాజు నేడు వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో ప్రతిపాదించిన 5/20 (కనీసం 20 విమానాలతో ఐదేళ్లు సర్వీసులు నడిపిన తరువాతనే అంతర్జాతీయ రూట్లకు అనుమతి) నిబంధన ఎత్తివేతకు తాము కట్టుబడ్డామని, దీనివల్ల దేశవాళీ సంస్థలు మరింత ఎదిగే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.