: యూపీలో వరుణ్ గాందీ పోస్టర్ల వెల్లువ... డైలమాలో బీజేపీ అధినాయకత్వం
దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ కీలక రాష్ట్రం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను అన్ని జాతీయ పార్టీలు సెమీ ఫైనల్ గా భావిస్తాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన తురుపు ముక్కగా ప్రియాంకా గాంధీని బరిలోకి దించుతోంది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి తనదైన పదునైన వ్యూహాలకు పదును పెడుతోంది. ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ప్రచార బాధ్యతలను అప్పగించే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా రాజ్ నాథ్ బరిలోకి దిగనున్నారన్న ప్రచారమూ సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ యువనేత... సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ పెద్దలకు షాకిస్తున్నారు. పార్టీకి మాటమాత్రంగా కూడా చెప్పకుండా ఆయన ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లను ఏర్పాటు చేసిన వరుణ్ గాంధీ... వాటిలో మోదీతో సమానంగా తన ఫొటోలను ఏర్పాటు చేశారు. యూపీ బీజేపీ సీఎం అభ్యర్థి తానేనన్న రీతిలో వరుణ్ గాంధీ సాగిస్తున్న ప్రచారంపై ఆ పార్టీ అధిష్ఠానం కాస్తంత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సుల్తాన్ పూర్ వదిలి బయటకు రావద్దని ఇప్పటికే జారీ చేసిన పార్టీ హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఆయన ప్రచారం సాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.