: అధిష్ఠానం కోరితే బీజేపీ యూపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతా: రాజ్‌నాథ్ సింగ్
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందించుకుని కసరత్తు మొదలు పెడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడ బీజేపీ సీఎం అభర్థి ఎవరు..? అనే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలోనే చర్చ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్‌లో తమ సీఎం అభ్యర్థిగా రాజ్‌నాథ్ సింగ్‌ను దింపాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో స్పందించారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారంటూ వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు. తమ పార్టీ నేతలు ఈ విషయంపై చర్చలు జరపడం లేదని ఆయన అన్నారు. అయితే, ఒకవేళ పార్టీ అధిష్ఠానం ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని వ్యాఖ్యానించారు.