: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో భద్రత కట్టుదిట్టం... గోడలపై వెలసిన ‘షూట్ ఎట్ సైట్’ హెచ్చరికలు
నూతన సంవత్సరాది వేడుకలు ముగియకుండానే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జనవరి 2 తెల్లవారుజామున పంజాబ్ లోని భారత వైమానిక దళ ప్రధాన కేంద్రం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మెరుపు దాడి చేశారు. ఈ ఘటన భారత్- పాక్ సంబంధాలను తీవ్ర ప్రభావితం చేసింది. ఇరు దేశాల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల కీలక భేటీకి ఈ దాడులు చెల్లుచీటి ఇచ్చాయి. దాడిలో రోజుల తరబడి పోలీసుల సోదాలతో భయానక వాతావరణంలో మగ్గిన పఠాన్ కోట్ లో ఇప్పుడిప్పుడే పరిస్ధితులు కాస్తంత చక్కబడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నిన్న మరోమారు కలకలం రేగింది. ఉగ్రవాదులు మరోమారు ఎయిర్ బేస్ పై విరుచుకుపడే ప్రమాదముందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో అక్కడ ఒక్కసారిగా భద్రత పెరిగింది. ఆర్మీ, బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఐదు గంటల పాటు పఠాన్ కోట్ సరిహద్దు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. అంతేకాక అనుమానితులెవరైనా కనిపిస్తే కాల్చేస్తామంటూ ‘షూట్ ఎట్ సైట్’ హెచ్చరికలకు సంబంధించిన పోస్టర్లు ఎయిర్ బేస్ గోడలపై వెలశాయి. దీంతో మరోమారు పఠాన్ కోట్ పరిధిలో ఎప్పుడేం జరుగుతుందోన్న భయాందోళనలు నెలకొన్నాయి.