: టీ కాంగ్రెస్ కు భారీ షాక్!... గుత్తా వెంట కేసీఆర్ ఫాం హౌస్ కు సురేశ్ రెడ్డి, వెంకటస్వామి తనయులు!
తెలంగాణలో అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మొన్నటిదాకా టీ టీడీపీ లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్... తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరేందుకు దాదాపు సిద్ధమైన టీ కాంగ్ సీనియర్ నేత, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి... ఈ నెల 11న గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్న మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవలిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం (ఫాం హౌస్)కు గుత్తా వెళ్లారు. ఫాం హౌస్ లో కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపిన గుత్తా... టీఆర్ఎస్ లో జాయినయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇదిలా ఉంటే... గుత్తా వెంట మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, దివంగత ఎంపీ జి.వెంకటస్వామి తనయులు జి.వివేక్ (మాజీ ఎంపీ), జి.వినోద్(మాజీ మంత్రి) కూడా కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లారట. తాము కూడా టీఆర్ఎస్ లో చేరతామన్న ప్రతిపాదనకు కేసీఆర్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. మొన్న వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగానే జి.వివేక్ టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరిగినా... కాంగ్రెస్ పార్టీని వీడబోనని నాడు ఆయన తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మనసు మార్చుకున్న వివేక్ తన సోదరుడు వినోద్ తో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో అంతగా ప్రాధాన్యం లభించని కేఆర్ సురేశ్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్న క్రమంలోనే వీరంతా టీఆర్ఎస్ బాట పట్టినట్టు సమాచారం. గుత్తాతో పాటే వీరంతా ఒకేసారి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే వచ్చే వారంలోనే వీరంతా టీఆర్ఎస్ లో చేరడం మాత్రం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.